Geetha Koumudi-1    Chapters   

ఏడవ కిరణము

అర్జున విషాదము

(గీత-1వ అధ్యాయము)

భగవద్గీతలోని అర్జున విషాదయోగము అనుమొదటి అధ్యాయములోని 47 శ్లోకములును, 'సాంఖ్యయోగము' అను రెండవ అధ్యాయములోని మొదటి 10 శ్లోకములున్ను కలసి 57 శ్లోకములున్ను అర్జునుని విషాదయోగమునకు చెందినవే అనిన్ని, ఆ 57 శ్లోకములున్ను విషయవారీగా విమర్శించినచో 6 భాగములుగా తేలుననిన్ని లోగడ మనము తెలిసికొన్నాము. ఆ 6 భాగములలో మొదటిది అయిన ధృతరాష్ట్రుని ప్రశ్నయును దానికి సంజయుని ప్రత్యుత్తరమున్ను విపులముగా లోగడ విశదీకరించబడినది. సంజయుడు ఉభయ సేనలను, ఆ ఉభయ సేనలవారు గావించిన శంఖారవములను వర్ణించిన తరువాత అర్జునుడు తనరథమును ఉభయసేనల మధ్యభాగమునకు తీసుకొని వెళ్ళవలసినదిగా తన రథసారధియైన కృష్ణుని కోరినాడనిన్ని, కృష్ణుడు అర్జునుని రెండుసేనల మధ్యకు తీసుకొనివెళ్ళి భీష్మ ద్రోణాదుల ఎదుట నిలుపగా అర్జునుడు భీష్మద్రోణాదులను, గురువులను, ఇతరులైన బంధువులను సమీక్ష చేసినాడనిన్ని సంజయుడు తెలియపరచినాడు.

ఉభయ సేనలలోనున్న గురువులను, బంధువులను అర్జునుడు సమీక్ష చేయగానే అర్జునునికి ఉత్కృష్టమైన కృప కలిగి యుద్ధములో వీరందరు చనిపోవుదురే అని విషాదము కలిగినది. ఇట్టి కృప, విషాదము అర్జునునికి సహజము కాదనిన్నీ ఆగంతుకమే అనిన్నీ భగవద్గీత అను ఉత్కృష్టమైన మోక్షగ్రంథమును కృష్ణుడు లోకమునకు అందింపచేయదలచి అర్జునునికి యిట్టి కృపావిషాదములను కలుగచేసి అతనిని శిష్యునిగా చేసికొని అతనిద్వారా గీతను అవతరింప చేసినాడనిన్నీ లోగడ గీతావతరణము అను శీర్షికక్రింద మనము తెలుసుకొన్నాము.

ఇపుడు అర్జునునికి కలిగిన విషాదము గురించి విచారణ చేసినచో అర్జునుడు తన విషాదములో 8 రకములైన భావములను వ్యక్తము చేసినట్లు కనబడును. అవి ఏవి అనగా -

1. మమత్వ ప్రకటన (1 అధ్యాయంలోని 28 నుంచి 31 శ్లోకము ఆఖరువర్కు.)

2. వైరాగ్య ప్రకటన (1 అధ్యాయంలోని 32 నుంచి 35 శ్లోకము ఆఖరువర్కు)

3. పాపభీతి ప్రకటన (1 అధ్యాంలోని 36 నుంచి 39 శ్లోకము ఆఖరువర్కు, 45, 46 శ్లోకములు)

4. వర్ణసంకరత్వ భావప్రకటన (1 అధ్యాయంలోని 40 నుంచి 44 శ్లోకము ఆఖరువర్కు)

5. స్వధర్మ త్యాగపూర్వక పరధర్మవాంఛ ప్రకటన (2వ అధ్యాయంలో 4, 5 శ్లోకములు)

6. జయసందేహప్రకటన (2వ అధ్యాయంలో 6వ శ్లోకము)

7. మూఢత్వ ప్రకటన (2వ అధ్యాయంలో 7వ శ్లోకము లోని మొదటి భాగం)

8. ముముక్షుత్వ ప్రకటన (2వ అధ్యాయంలో 7వ శ్లోకంలోని 2వ భాగం)

1. మమత్వ ప్రకటన.

అర్జునుడు ఉభయసేనలలోని బంధువులను చూడగనే వారందరు కేవలం నాస్వజనమే వీరందరిని యుద్ధములో చంపితే నాకేమి శ్రేయస్సు కలుగును. ఛీ, యింతటి ఘోరమైన కార్యముకు పేనుకొనుటా, అను ఉత్కృష్టమైన కృపతో కూడుకొన్నవాడై దీనుడైనాడు. ఇట్టి దీనస్థితికి కారణము వీరందరు నావారు అను మమత్వమేకదా. ఈ మమత్వానికి పూర్వరంగంలో దేహమే నేను అను అహమధ్యాస ఉన్నది. అధ్యాస అనగా ఒక వస్తువును యింకొక వస్తువుగా భావించుట. త్రాడును చూచి పాము అనుకొనుట అధ్యాస. అటులనే దేహములో తాను ఉంటూ తాను కాని దేహమును తాను అను అహమధ్యాస పుట్టిన తరువాత, ఆ దేహానికి సంబంధించినవా రందరియందు వీరందరు నావారు అను మమాధ్యాస కల్గును. యీ విధముగా కలిగి మమత్వానికి దానికి మూలమైన అహమధ్యాసకు కారణం అజ్ఞానమేకదా ! ఇట్టి మమత్వ ప్రకటనమును అర్జునుడు గావించినాడు.

2. వైరాగ్య ప్రకటన.

ఇట్టి మమత్వంచేత అర్జునుడు దీనుడై నాకు యుద్ధములో జయ మక్కర లేదు. నాకు రాజ్య మక్కర లేదు. నాకీ ఐహికసుఖము లక్కరలేదు, నాకు ముల్లోకాధిపత్యమందు కూడా వాంఛ లేదు, అని ఐహిక భోగములందును, ఆముష్మిక భోగములందును కూడా వైరాగ్యమును కనపర్చినాడు.

3. పాపభీతి ప్రకటన.

ఇట్లు వైరాగ్యమును వ్యక్తము చేసిన తరువాత యీ దుర్యోధనాదులందరు ఆతతాయులు అనగా ఘోరకృత్యములు చేసిన దుర్గ్మార్గులే అయిననూ, వీరి నందరిని చంపితే చంపిన పాపమున్ను కులక్షయమవుతుంది. కనుక అట్టి పాపమున్ను, మిత్రద్రోహమగును. కనుక అట్టి పాపము వచ్చునని చెప్పి ఆ దుర్యోధనాధులు లోభాదులచేత అట్టి పాపభీతిని పొందకపోయినను అన్ని తెలిసిన మేమి ఏలా యిట్టి పాపాచరణకు దిగుతాము అనిన్ని స్వజనమైనవారి నందరిని చంపితే మాకు ఏమిసుఖం కలుగుతుంది అనిన్ని అహో, యీ రాజ్యసుఖాలకోసము ఎంతటి ఘోరమైన పాపము చేయటానికి సిద్ధపడినాము అనిన్ని యీ విధముగా పాపభీతిని అర్జునుడు వ్యక్తము చేసినాడు.

4. వర్ణ సంకరత్వభీతి ప్రకటన.

ఇంకను యుద్ధంవల్ల కులక్షయం, కులక్షయమువల్ల సనాతనధర్మమునకు హాని. అధర్మాభివృద్ధి, స్త్రీలు చెడుట, వర్ణసంకరత్వము కూడ వస్తుందని అర్జునుడు విలపించినాడు. ఇట్టి సాంకర్యమువల్ల నరకప్రాప్తి మున్నగు దోషాలు వచ్చుననిన్ని ఇట్లు వర్ణసంకరత్వభీతిని వ్యక్తం చేసినాడు.

5. స్వధర్మ త్యాగపూర్వక పరధర్మ వాంఛా ప్రకటన.

ఇంతేగాక క్షత్రియుడైన తనకు యుద్ధకర్మస్వధర్మమే అయ్యుండగా, అట్టి స్వధర్మము నందు విముఖత కలిగి 'యుద్ధముచేయను' అని స్వధర్మ త్యాగబుద్ధిని వ్యక్తము చేయుటే కాక, పరధర్మమైన భిక్షాటనమునందు వాంఛను కూడ అర్జునుడు కనపర్చినాడు. భిక్షాటనముచేత జీవించుట బ్రాహ్మణజాతికి ధర్మముకాని, బ్రాహ్మణతరులకు ధర్మము కాదు. ఇట్లు అర్జునుడు సధర్మమునందు వైముఖ్యమును, పర ధర్మమునందు వాంఛను వ్యక్తంచేసినాడు.

6. జయసందేహ ప్రకటన.

అర్జునుని మనస్సులో ఇంకొక రకమైన భావముకూడ కల్గినది. పోనీ, యుద్ధం చేస్తామనుకో. ఈయుద్ధంలో మనమే గెలుస్తామో, కౌరవులే గెలుస్తారో ఏమి చెప్పగలము? మనమే తప్పక గెలుస్తాము అను నిశ్చయం లేదుకదా. ఇట్టి సందేహాస్పదమైన విషయములో యుద్ధములో పాల్గొను టెందుకు?" అని జయసందేహాన్ని కనపర్చినాడు.

7. మూఢత్వ ప్రకటన.

ఈ విధముగ అర్జునుని మనస్సులో అనేకరకములైన భావములు కలుగగా కృష్ణునితో "కృష్ణా ! నా బుద్ధిని మోహము ఆవరించినది. నేను ధర్మమేదో అధర్మమేదో తెలుసుకోలేని మూఢుణ్ణి అయిపోయినాను" అని తన మూఢత్వాన్ని వ్యక్తం చేసినాడు.

8. ముముక్షుత్వ ప్రకటన.

ఇట్లు ధర్మసమ్మూఢత్వమును ప్రకటన చేసిన తర్వాత ఏమి చేయవలెనో తోచక, అర్జునుడు కృష్ణుని పాదాలమీద పడి, "కృష్ణా నేను నిన్ను ప్రపత్తితో వేడుకొనుచున్నాను. నీవే నాకు గురువువు.నన్ను దయతో శిష్యునిగా గ్రహించి, నాకేది శ్రేయోదాయకమో అట్టిది నాకు బోధించుము" అని తన ముముక్షుత్వమును వెల్లడి చేసినాడు.

అర్జునుని విషాదమును పరిశీలించినచో పై ఎనిమిది భావములు స్పష్టముగా వ్యక్తమగుచున్నవి.

_

Geetha Koumudi-1    Chapters